యూరియా కోసం రైతుల నిరీక్షణ.. బుకింగ్‌లో గందరగోళం
యాప్ చుట్టూ యూరియా పంచాయితీ
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మండలంలో యూరియా(Urea) కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మండుటెండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుండగా, మరోవైపు యూరియా పొందేందుకు యాప్‌లో నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. యాప్‌లో బుకింగ్ ప్రక్రియ అందరికీ ఒకే విధంగా అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యలు, సమాచారం సకాలంలో అందకపోవడం వల్ల సాధారణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా నిల్వలు వచ్చినప్పుడు ముందుగా సమాచారం తెలిసిన కొందరు రైతులు మాత్రమే యాప్‌లో బుకింగ్ చేసుకోగలుగుతున్నారని, సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న రైతులు బుకింగ్ చేసుకునేలోపే యూరియా అయిపోతోందని రైతులు చెబుతున్నారు. దీంతో యూరియా కోసం రైతులు ఒకవైపు క్యూలో నిలబడుతూనే మరోవైపు తమ మొబైల్ ఫోన్లలో యాప్‌ను చూస్తూ బుకింగ్ కోసం ప్రయత్నించాల్సి వస్తోందని వాపోతున్నారు.