అగ్నికీలలు

30-09-2026 | 10:32am

రూ.కోటి విలువైన వైద్య సామగ్రి దగ్ధం -నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటల అదుపు

శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): నగర శివారులోని చందానగర్‌లో(Chandanagar) మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సాయి అనురాగ్‌ హాస్పిటల్‌ సమీపంలోని సర్జికేర్‌ షాపి మెడికల్‌ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో వైద్య పరికరాలు, సర్జికల్‌ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అర్ధరాత్రి సమయంలో గోడౌన్‌ నుంచి దట్టమైన పొగ, మంటలు వెలువడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే పటాన్‌చెరు అగ్నిమాపక సిబ్బంది(fire service personnel) నాలుగు ఫైర్‌ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

అగ్నిప్రమాదం ధాటికి గోడౌన్‌లోని సుమారు రూ.కోటి విలువైన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌(Medical Equipment), సర్జికల్‌ వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రాథమికంగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై గోడౌన్‌ యజమాని చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు