7 September, 2026 | 7:27 AM

నేపాల్ థేరాంగ్‌లో వరదలు

07-09-2026 | 05:10am
  • కూలిన 4 ఇళ్లు, కొట్టుకుపోయిన వంతెన
  • గత నెల వరదల్లో 1,344 మృతదేహాలు లభ్యం
  • 5వేల మంది ఆచూకీ గల్లంతు
  • 7,570 ఇళ్లు నేలమట్టం, కొట్టుకుపోయిన 55 కి.మీ. రహదారులు, కూలిన 105 వంతెనలు
  • దొరికిన బంగారం, డబ్బు అప్పగించాలని పోలీసుల వార్నింగ్
  • 400 బిలియన్‌ల నష్టం: ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఎ ప్రకటన

ఖాఠ్మాండు, సెప్టెంబర్ 6: ఓ వైపు నేపాల్ వరద బీభత్సం(Devastating floods) ఇంకా మరిచిపోకముందే ఆదివారం గోర్ఖా జిల్లాలోని థేరాంగ్ నది(Therang River)లో భారీ వరదలు సంభవించాయి. దీంతో థేరాంగ్ తీర ప్రాంతమైన బుధిగండకి ప్రాంతానికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వరదలతో నాలుగు ఇళ్లు నేలమట్టం కాగా, ఒక వంతెన కొట్టుకుపోయిందని, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆగస్ట్ 26న సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 1,344 మృతదేహాలు లభ్యం కాగా, 5000వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఎ (నేషనల్ డైజెస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ప్రకటించింది. 7,570 ఇళ్లు నేలమట్టం కాగా, 55 కి.మీ. రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయని, 105 వంతెనలు కూలిపోయాయని ప్రకటించింది.

వరదలతో 1,806 హెక్టార్ల వ్యవసాయ భూమి, 13 జలవిద్యుత్ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందని 783 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని పేర్కొంది. ఈ సంస్థ ప్రాథమిక అంచనా ప్రకారం 400 బిలియన్ల నేపాలీ రూపాయల నష్టం వాటిల్లింది. నేపాల్ రెస్క్యూ బృందాలతోపాటు, అనేక దేశాల సహాయక బృందాలు ఆచూకీ గల్లంతైన వారి కోసం వెతుకుతున్నాయని తెలిపింది. వరదలతో నేపాల్ పర్యాటక రంగానికి అత్యధిక నష్టం వాటిల్లిందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు