మూడేళ్లుగా మూడు కిలోమీటర్ల కాల్వ తవ్వలేరా?

25-09-2026 | 05:05am

మంత్రులు హెలిక్యాప్టర్‌లో వెళ్లి ఏం సాధించారు.?

మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కర్ణాటక ప్రభుత్వం విడతల వారీగా మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తున్న ట్లు ప్రకటించిన నేపథ్యంలో అందుకు మంత్రులు హెలిక్యాప్టర్‌లో వెళ్లడం హాస్యాస్పదమని మాజీమంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి(Former Minister Nagam Janardhan Reddy) అన్నారు.  గురువారం స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉన్న ప్పటికీ వరద జలాలను ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project) వద్ద ఐదు మోటర్లు వెట్న్ల్రు నిర్వహించినా కాల్వల పనులు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. కేఎల్‌ఐ కాల్వలను మొదట ఐదు వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా డిజైన్ చేసినప్పటికీ ప్రస్తుత ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్ల వాటి సామర్థ్యాన్ని తగ్గించారని ఆరోపించారు.

ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కేవలం మూడు కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉన్న సున్నపుతండా కాల్వ పనులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు.అది పూర్తి చేస్తే సుమారు 60 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాజెక్టు రిజర్వాయర్ల ద్వారా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి చెరువులు, కుంటలను నీటితో నింపాలని సూచించారు. విధులకు సక్రమంగా హాజరుకాని సీఈ, ఎస్‌ఈ విజయభాస్కర్ రెడ్డిని ఇప్పటికి ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


మరిన్ని వార్తలు