బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) తన స్వగ్రామమైన దీపాయిగూడలో పొలాల పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు అండగా నిలిచే బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. రైతు జీవితంలో పశువులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, వ్యవసాయం(Agriculture)లో రైతుకు వెన్నుదన్నుగా నిలిచే బసవన్నలను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ జరుపుకునే గొప్ప పండగే పొలాల పండగ అని అన్నారు.
తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు పొలాల పండగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూర్వికుల సాంప్రదాయాలను అద్దం పట్టేలా నేటికీ పొలాల ఘనంగా జరుపుకుంటూ సంస్కృతిని చాటి చెప్పడం జరుగుతుందన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ పొలాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు ఇజ్జగిరి నారాయణ, సర్పంచ్ నితిన్, బొల్లి గంగన్న, లోక కృష్ణారెడ్డి, దూర్ల సంతోష్, దేవార్థి శ్రీనివాస్, హనుమాన్లు ,కార్యకర్తలు పాల్గొన్నారు.