దేశానికి డ్రగ్స్ నుంచి విముక్తి
- రోడ్‌మ్యాప్‌తో ముందుకు..
- 2029 మాదకద్రవ్య రహిత దేశంగా భారత్
- అక్రమ ధనం ఉగ్రవాదానికి వినియోగం
- 14 ఏజెన్సీలను ‘భారత్‌పోల్’తో అనుసంధానించాం
- గోవాలో హింసాత్మక ఘటనల తగ్గుదల
- సీఎంను అభినందించిన కేంద్రమంత్రి అమిత్ షా
గోవా, సెప్టెంబర్ 6: భారతదేశాన్ని మాదకద్రవ్యాలు నుంచి 2029 వరకు విముక్తి కల్పిస్తామని, మాదకద్రవ్య రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రకటించారు. ఆదివారం గోవా పర్యటనలో ఉన్న ఆయన సీఎం ప్రమోద్ సావంత్‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
మాదకద్రవ్యాలను పూర్తిగా నిరోధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని స్పష్టం చేశారు. ఈ కార్యాచరణ ద్వారా రాష్ట్రాలు, కేంద్రం విడివిడిగా కాకుండా సమన్వయంతో ముందుకు వెళుతున్నాయని చెప్పారు. మాదకద్రవ్యాల ద్వారా వచ్చే అక్రమ ధనాన్ని ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారని వివరించారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. ఈ వ్యవస్థలను సమూలంగా మార్చామని, బాధితులకు మద్దతు అందజేస్తున్నామని చెప్పారు. గతంలో చిన్నచిన్న వారిని పట్టుకొని చేతులు దులుపుకునే వారని చెప్పారు.
కానీ తమ ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాధాన్యత అంశం కింద చేర్చడంతో పూర్తి నెట్‌వర్క్ మూలాల వరకు వెళుతున్నామని చెప్పారు. నార్కో కో ఆర్డినేషన్ సెంటర్, ఎన్‌సీబీ, సీసీటీఎన్‌ఎస్‌లను పటిష్ఠం చేశామన్నారు. చట్టాలను మరింత పటిష్ఠం చేశామన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి డార్క్‌నెట్, ఎన్‌క్రిప్టెట్, క్రిప్టో చెల్లింపులు, డెడ్ డ్రాప్ వంటి వాటిపై దర్యాప్తు చేస్తూ ఉక్కుపాదం మోపుతున్నామని షా వివరించారు.
2019 నుంచి 2026 జూలై మధ్య 36 దేశాల్లోనే 274 మంది నిందితులను పట్టుకున్నామని, న్యాయస్థానాల ముందు హాజరుపరిచామన్నారు. 182 మందికి రెడ్ కార్నర్ నోటీసులు అందజేశామన్నారు. రూ. 17,874 కోట్ల ఆస్తులను సీజ్ చేశామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టేందుకు 14కు పైగా కేంద్ర ఏజెన్సీలను ‘భారత్‌పోల్’తో అనుసంధానించామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. నక్సలిజాన్ని అంతం చేశామని, ఈశాన్య ప్రాంతంలో 10వేల మంది ఆయుధాలు విడిచిపెట్టేలా చేశామని చెప్పారు. గోవాలో చట్టవ్యతిరేక కార్యలాపాలు తగ్గడంపై సీఎం, పోలీసులను అభినందించారు.






