గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం
- సత్యం, అహింసా మార్గాలను అనుసరించాలి
- మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్
రామాయంపేట అక్టోబర్ 2 (విజయ క్రాంతి): సత్యం, అహింసా సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలను(Mahatma Gandhi's ideals ) నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహ మార్గంలో మహాత్మా గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా సత్యం, అహింసా సిద్ధాంతాలతో స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన మార్గాన్ని నేటి తరం ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత మరింత బలోపేతమవుతాయని అన్నారు. గాంధీజీ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు బాదే చంద్రం.మద్దెల రమేష్. ఎస్.కె అహ్మద్. విద్యాకర్. తదితరులు పాల్గొన్నారు.