రికార్డు ధర పలికిన గణనాథుడి లడ్డూ

25-09-2026 | 01:11pm

రూ. 2.50 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ

వేలం పాటలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న పవులూరి వినోద్ రెడ్డి

ఘనంగా వినాయకుడి శోభాయాత్ర

ఘట్‌కేసర్,(విజయక్రాంతి): పోచారం డివిజన్ పరిది అన్నోజిగూడలోని సూర్య యూత్ అసోసియేషన్(Surya Youth Association) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన గణనాథుడి లడ్డూ ప్రసాదం వేలం పాటలో రికార్డు ధర పలికింది. వినాయకుని చేతిలో ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూను భక్తుడు పవులూరి వినోద్ రెడ్డి రూ. 2లక్షల 50 వేలతో వేలం పాటలో సొంతం చేసుకున్నారు. సూర్య యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నవరాత్రులు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని(Ganesh Immersion) ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రకు ముందు మండపం వద్ద నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట(Ganpati Laddu Auction) భక్తుల పోటాపోటీ మధ్య అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.

పలువురు భక్తులు పోటీ పడగా, చివరకు పవులూరి వినోద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో పుణ్యప్రదమని, తమ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందని ఈ సందర్భంగా వినోద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విజేతను అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఘనంగా సత్కరించారు. లడ్డూ వేలం అనంతరం బాజాభజంత్రీలు, కోలాటాలు, భక్తుల నృత్యాల నడుమ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు