ఎన్నికల్లో 12 ఏరియాల్లో విజయం సాధించడమే లక్ష్యం : జనక్ ప్రసాద్
సత్తుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి(Singareni) ఐఎన్టీయుసీ కొత్తగూడెం రీజియన్ పరిధిలోని కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, సత్తుపల్లి ఏరియాల విస్తృత స్థాయి నాయకుల సమావేశం జరిగింది. సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ త్యాగరాజన్(Central Senior Vice President Shri Thyagarajan) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డా.బి. జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, జట్టి శంకరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు శేషారత్నం, కొత్తగూడెం రీజియన్ ఐదు ఏరియాలకు చెందిన సెంట్రల్ కమిటీ నాయకులు, వైస్ ప్రెసిడెంట్లు, బ్రాంచ్ సెక్రటరీలు, పిట్ సెక్రటరీలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏరియాల్లోని గనులకు సంబంధించిన సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చట్టసభల్లో కార్మిక సమస్యలపై గళం వినిపించేందుకు కార్మిక నాయకుల ప్రాతినిధ్యం అవసరమనే అంశాలను నాయకులు డా. జనక్ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు యూనియన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమం, యూనియన్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా.బి. జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 12 ఏరియాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆరు ఏరియాల్లోనూ విజయం సాధించి, ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడి కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నది ఐఎన్టీయూసీ అని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో స్థానిక మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో కొత్తగూడెం రీజియన్లోని అన్ని ఏరియాల్లో విజయం సాధించామని రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో గెలిచిన వెంటనే కార్మికుల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం, నైని, తాడిచర్ల-2, మణుగూరు డీప్ సైడ్ మైన్ రావడం వంటి అంశాల్లో ఐఎన్టీయూసీ, ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు.
ఈసారి సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోనూ గెలుపు సాధించేందుకు యూనియన్ బలోపేత కమిటీల పునర్నిర్మాణం అవసరమని తెలిపారు.సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వ సహకారం పొందడం, మెడికల్ బోర్డు ఏర్పాటు , సొంత ఇంటి కలను నెరవేర్చడం, మారుపేర్ల మార్పు, నూతన గనుల ప్రారంభం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డా.జనక్ ప్రసాద్ అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటూ, యూనియన్ను మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.