ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు(best teachers)గా ఎంపికైన నలుగురు, మరియు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 23 మంది ఉపాధ్యాయులకు గురువారం రోజున ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, అభ్యసన సామర్థ్యాల పెంపు, సృజనాత్మకతను వెలికితీయడం, విద్యార్థుల(Students) సర్వతోముఖ వికాసం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉత్తమ ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్బంగా ఎంపీడీఓ రాధా మాట్లాడుతూ ఉపాధ్యాయులు పదవీ విరమణ(Teacher retirement) చేసిన తర్వాత కూడా వారి పూర్వ విద్యార్థులు వారిని కలవడానికి వస్తుంటారని అన్నారు. జీవితంలో ఎంతోమందిని కాలక్రమేణా మరిచిపోయినా, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను మాత్రం విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన 27 మంది ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ, వారి సేవలు ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే మండల విద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ద్వారా విద్యార్థుల కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకుంటూ ప్రతి విద్యార్థి నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ గౌరవం తమపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నలుగురు, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 23 మంది ఉపాధ్యాయులను సన్మానించారు.