వాహనాలు నడిచేది ఎలా?

25-09-2026 | 07:02pm

వెంకటాపురం, నూగూరు సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వెంకటాపురం(Venkatapuram) మండల కేంద్రం నుంచి చర్ల భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి(Main road) అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు వాటిలో నీరు చేరి రోడ్డు కాస్తా నీటి కుంటను తలపిస్తోంది.

ఈ మార్గంలో నిత్యం వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రధాన రహదారి అత్యంత అధ్వాన స్థితికి చేరినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు, వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు