గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు.. ఎనిమిది మంది అరెస్ట్

10-09-2026 | 08:26pm

మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్‌తో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల పోలీస్ స్టేషన్(Chivvenla Police Station) పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతన ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల(Hidden funds) కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సెప్టెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున కేషరాజు కుంట కట్ట వద్ద అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్న వారిని గుర్తించారు. వారి వద్ద నుంచి మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం(Lakshmi Narasimha Swamy Temple) చైర్మన్ చకిలం కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్సై వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు