మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం
* సీతారామ ప్రాజెక్టుతో పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణ పనులు: మంత్రి తుమ్మల
అశ్వాపురం, సెప్టెంబర్ 23, (విజయక్రాంతి): రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ అశ్వాపురం మండలం మారెళ్లపాడులో ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) బుధవారం ప్రారంభించి, పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను తుమ్మల చెరువుకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుతో సుమారు పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొలి విడతలో 4,300 ఎకరాలకు, దశలవారీగా అశ్వాపురం మండలంలో 22–23 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభంతో అశ్వాపురం, పినపాక ప్రాంత రైతుల దశాబ్దాల కల నెరవేరిందన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.