అభివృద్ధి వేగానికి రోడ్డు ప్రమాదాల బ్రేక్!
డీజే మోహనరావు :
భారత్‌లో రోడ్డు ప్రమాదం(Road accident) జరిగిన ప్రతిసారి చర్చ డ్రైవర్(Driver) తప్పిదం చుట్టూనే తిరుగుతుంది. అతివేగమా? మద్యం సేవించాడా?(drink alcohol) నిబంధనలు ఉల్లంఘించాడా?(violate the rules) నిర్లక్ష్యంగా నడిపాడా? ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలే. కానీ, అసలు ప్రశ్న మరొకటి--- మనిషి తప్పు చేయడం సహజమైనప్పుడు, ఆ తప్పు ప్రాణాంతకంగా మారకుండా మన రవాణా వ్యవస్థను ఎందుకు రూపొందించలేకపోతున్నాం? రోడ్డు భద్రతను ఈ కోణంలో చూడకపోతే ప్రమా దాల మూలాన్ని కాకుండా వాటి ఫలితాలను మాత్రమే ఎదుర్కొంటున్నట్టవుతుంది. భారతదేశంలో(India) సమస్య తీవ్రతకు అందుబాటులో ఉన్న తాజా జాతీయ గణాంకాలే(National Statistics) నిదర్శనం.
కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2023 నివేదిక ప్రకారం దేశంలో 4,80,583 రోడ్డు ప్రమాదాలు నమోదై, 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,62,825 మంది గాయపడ్డారు. అంటే ప్రమాదం అనేది ఒక్కో కు టుంబాన్ని మాత్రమే దెబ్బతీసే ఘటన కాదు. ఆ కుటుంబ ఆదాయం, పిల్లల భవిష్యత్తు, ఉత్పాదకత దెబ్బతింటాయి. రోడ్డు ప్రమాదాలను రవా ణా సమస్యగా మాత్రమే కాకుండా మానవ మూలధనం, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి సమస్యగానూ చూడాలి.
ఇదే సమయంలో రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా సమస్య పరిమాణాన్ని తెలియజేస్తున్నాయి. 2024- వార్షిక నివేదిక ప్రకారం జాతీయ రహదారులపై 13,795 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. 2024 డిసెంబరు నాటికి వాటిలో 9,525 ప్రాంతాల్లో తాత్కాలిక భద్రతా చర్యలు, 4,777 ప్రాంతాల్లో శాశ్వత సవరణలు పూర్తయ్యాయి. రహదారి సూచికలు, రహదారి గుర్తులు, వేగ ని యంత్రణ ఏర్పాట్ల నుంచి ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు, పాదచారుల వంతెనలు, సర్వీస్ రోడ్ల వరకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడిం చింది. ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదం సంభవించే ప్రదేశాలను ముందుగానే గుర్తించి మార్చడం మరింత అవసరం.
ఇతర దేశాల అనుభవం ఈ మార్పునకు దిశ చూపుతుంది. నార్వేలో 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 87 మంది మాత్రమే మరణించారు. అది ప్రతి పది లక్షల జనాభాకు 16 మరణాలకు సమానం. స్వీడన్‌లో అదే ఏడాది 213 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల జనాభా, రహదారి వ్యవస్థ, వాహన వినియోగం భారత్‌లో పోల్చదగినవి కావు. అయినా వాటి నుంచి నేర్చుకోవాల్సిన సూత్రం మాత్రం స్పష్టంగా ఉంది.---రోడ్డు ప్రమాదాలను కేవలం డ్రైవర్ ప్రవర్తన సమస్యగా కాకుండా రహదారి రూపకల్పన, వేగం, వాహన భద్రత, చట్ట అమలు, అత్యవసర వైద్యం అన్నింటినీ కలిపిన వ్యవస్థగా చూడాలి.
ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు తప్పు చేశారన్న దానికంటే, ఆ ప్రమాదంలో మనిషి ఎందుకు ప్రాణాలు కోల్పోయాడన్న ప్రశ్నకు వ్యవస్థ సమాధానం వెతకాలి. భారత్‌కు ఈ విధానాన్ని యథాతథంగా దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదు. మన రహదారులపై కార్లతో పాటు ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, భారీ వాహనాలు, సైకిళ్లు, పాదచారులు ఒకే రవాణా స్థలాన్ని పంచుకుంటున్నారు. అందువల్ల మన పరి స్థితులకు అనుగుణంగా రహదారులను రూపొందించాలి. పాఠశాలలు, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, బస్టాప్‌లు ఉన్న చోట పాదచారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. అవ సరమైన చోట సురక్షితంగా రోడ్డు దాటడం, పాదచారి మార్గాలు, మధ్య విభజనలు, తగిన వెలుతురు ఏర్పాటు చేయాలి. ప్రమాదకర మలుపులు, కూడళ్లు, ఎక్కుపల్లాలు, వాహనాల వేగం అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాలను శాస్త్రీయంగా పునఃరూపకల్పన చేయాలి.
వ్యాసకర్త మెయిల్ imrdunga@gmail.com