శతక్కొట్టిన ఇషాన్ కిషాన్
ఈస్ట్ జోన్ భారీ స్కోరు
చేతుల్తేసిన సాత్ జోన్ బౌలర్లు
తొలిరోజు ఈస్ట్ జోన్ 385/4
చెన్నై, సెప్టెంబర్ 6: దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో ఈస్ట్‌జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.
వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్‌లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్‌తో అలరించాడు.
అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్‌కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్‌జోన్ బౌలింగ్‌ను ఆటాడుకున్న ఇషాన్ అర్ధసెంచరీ సాధించాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్ధసెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. సిరాజ్, దేవ్‌దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి చేరినప్పటికీ, సౌత్‌జోన్ బౌలర్లు ఈస్ట్ జోన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. బ్యాడ్‌లైట్ కారణంగా అంపైర్లు మరో 11 ఓవర్లు మిగిలి ఉండగానే తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.






