పడకేసిన 20 పడకల ఆసుపత్రి

10-09-2026 | 04:05am

పేరుకే 24/7.. 

డిప్యూటేషన్‌పైనే విధులు.. 

-సిబ్బంది కొరత 

చందుర్తి, సెప్టెంబర్ 09, (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు వెన్నెముకగా ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) అనేక మౌలిక మరియు నిర్వహణ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అదే చందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం. ఈ ఆరోగ్య కేంద్రాన్ని నూతనంగా ఎఫ్ ఎఫ్ సి నిధులతో కోటి 56 లక్షల వ్యయంతో నిర్మించారు.

చందుర్తి, రుద్రంగి మండలాలకు ఈ ఆరోగ్య కేంద్రమే సేవలందించాలి, సుమారు ఈ రెండు మండలాలలో 29 గ్రామ పంచాయతీల ప్రజలకు ఈ కేంద్రం నుండే సేవలందించాలి, కానీ ఈ ఆసుపత్రిలోని సమస్యలు చూస్తుంటే ‘రాస్తే రామాయణం, చెబితే మహాభారతం‘ అనే సామెత గుర్తుకొస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 24 గంటల సేవలందించే ఈ ఆసుపత్రిలో సుమారు మూడు, నాలుగు సంవత్సరాల నుండి  డిప్యూటేషన్ డాక్టర్లే  దిక్కవుతున్నారు. నిరంతర సేవలందించే డాక్టర్లే లేరు.

ఈ హాస్పిటల్లో రెండు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా అందులో శాశ్వతమైన వైద్యుడిని నియమిస్తే తాను ఏరియా హాస్పిటల్ కి డిప్యూటేషన్ పైన వెళ్తున్నాడు. నియమించిన డాక్టర్ డిప్యూటేషన్ పై వెళ్లడానికి కారణం ఏంటనే ఆరోపణలున్నాయి. ఇక్కడ నియమించిన డాక్టర్ వేరే ఆసుపత్రికి వెళితే మరి చందుర్తి హాస్పిటల్ సంగతి ఏంటని మండల ప్రజలు వాపోతున్నారు, కోనరావుపేట మండలంలో పనిచేస్తున్న  డాక్టర్ ను చందుర్తికి డిప్యూటేషన్ పై వేశారు, ఈ డిప్యూటేషన్ల బాధ తీరేది ఎప్పుడు, ప్రజలకు నిరంతరం వైద్య సేవలందించేదెప్పుడు. అలాగే ఈ ఆసుపత్రిలో ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, పోస్టులు ఖాళీగా కూడా ఉన్నాయి.

సీనియర్ అసిస్టెంట్ సంగతేంటి?  

ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యుడిసి (సీనియర్ అసిస్టెంట్) గా పనిచేస్తున్న అధికారి  నెలకు ఒక్కసారి  డ్యూటీకి  వస్తున్నాడని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆరోపిస్తున్నారు,. ఈ అధికారి డ్యూటీ కి రాకుండా ఉండడానికి ఎవరు సహకరిస్తున్నారో అని అనుమానం లేకపోలేదు.

పబ్లిక్ హెల్త్ నర్స్ పనులు ఎక్కడ? 

ఈ పిహెచ్‌ఎన్ (పబ్లిక్ హెల్త్ నర్స్) గా పనిచేస్తున్న నర్స్ ఆరోగ్య కేంద్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదు,  ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఆమె, చేసే పని దినాల కంటే తాను తీసుకున్న సెలవు దినాలే ఎక్కువని ఈ హాస్పిటల్లో పనిచేసే వారు చెప్తున్నారు. ఇలాంటి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఉపయోగపడని సిబ్బందిని వెంటనే తొలగించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న డిప్యూటేషన్ డాక్టర్లకు పూర్తి బాధ్యతలు లేకపోవడంతో నిరంతరం ఆసుపత్రిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అలాగే కావాల్సిన వస్తువులు మరియు హాస్పిటల్ ఏ అవసరమైన  ప్రతిదానికి ఇక్కడ అందుబాటులో లేని వేరే డాక్టర్ ను సంపాదించాల్సివస్తుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు ఇస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందివచ్చని సిబ్బంది కోరుకుంటున్నారు.చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాడిన పెట్టడానికి జిల్లా అధికారులు తక్షణమే వారిపై చర్యలు చేపట్టి, మౌలిక వసతులు మరియు సిబ్బంది కొరతను తీర్చి,త్వరితగతిన ఈ ఖాళీ ఉన్న  పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు