పార్టీల కన్నా విలువలు ప్రధానం

10-09-2026 | 05:20am
  1. చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తనలో మార్పురావాలి
  2. ‘సంసద్ రత్న’ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పార్టీల కన్నా పార్లమెంటరీ (Parliamentary) విలువ లే ప్రధానమని, అప్పుడే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy)పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి.. ప్రశ్నించాలి.. సమస్యలను లేవనెత్తాలి అంతేకానీ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని, చొక్కాలు విప్పామని ఒక పార్టీ, విప్పించామని మరోపార్టీ సంబరపడుతోందని, ఇది ప్రజాస్వా మ్య వ్యవస్థకు చేటు తెస్తుందని తెలిపారు. ప్రజలు రాజకీయ నాయకుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తుంటారని, అందుకే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు హుందా గా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఒక రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను ఇవాళ ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, ఇదంతా ప్రజాస్వా మ్యం గొప్పతనం వల్లే సాధ్యమైందన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లో అటల్ బిహారీ వాజపేయి, పీవీ నరసింహారావు, మొరార్జీ దేశాయ్ లాంటి ఎందరో మహానుభావుల ప్రసంగాలు వింటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, తన జీవితంలో ఏనాడూ అసెంబ్లీ వెల్ లోకి అడుగుపెట్టలేదన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరు కాలేదని, తొలిరోజు నుంచి మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల వరకు సెషన్ నడిచిన ప్రతిరోజూ సభకు హాజరైనట్లు తెలిపారు. స్పీకౌట్, వా కౌట్‌కు బదులుగా.. పార్లమెంటులో గందరగోళం సృష్టించడంపైనే విపక్షాలు దృష్టిసా రించాయని పేర్కొన్నారు. చట్టసభల్లోకి వచ్చిన వారు.. ప్రజాసమస్యలపై కలసి పనిచేయాలి తప్పా పార్లమెంటును, అసెంబ్లీని స్తంభింపజేస్తే అది ప్రజలను అగౌరవపరిచినట్లేనని ఆయన తెలిపారు.

ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు, నిందలు వేయడం సరికాదన్నారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 16  మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు అందజేశారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజూందార్, మాజీ సీజేఐ బీఆర్ గవాయ్, మాజీ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ పాల్గొన్నారు.

సికింద్రాబాద్ మల్టీట్రాకింగ్ రైల్వేలైన్‌పై హర్షం

సికింద్రాబాద్ - మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్రమత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. రూ. 2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ వలన రైళ్ల ట్రాఫిక్ తగ్గడంతో పాటుగా రైళ్ల సమయపాలన మెరుగుపడనుందని ఆయన వెల్లడించారు.


మరిన్ని వార్తలు