క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా జనసేన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంస్థాగత ఎన్నికలకు పోటీ
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం: గడల శ్రీనివాస్
మణుగూరు,(విజయక్రాంతి): తెలంగాణలో జనసేన పార్టీని(Janasena Party) క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, గ్రామ గ్రామాన ప్రజా సమస్యలపై పోరాడే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ తెలిపారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలంగాణలో జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే నైజాన్ని కొనసాగించాలని పిలుపు నిచ్చారు. సోమవారం మణుగూరులో పర్యటించిన గడల శ్రీనివాస్‌కు హనుమాన్ టెంపుల్ వద్ద జనసేన పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కోసన అంకబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ మీదుగా డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌కు చేరుకుని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడల శ్రీనివాస్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు కార్పొరేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, అందుకోసం జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని అన్నారు.ఈ నెల 13న ఖమ్మం నడిబొడ్డున “జనసేన శంఖారావం” పేరుతో వేలాది మంది జనసేన కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
