జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
- ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
- టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్ర శేఖర్
ముకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్ర శేఖర్ లు డిమాండ్ చేశారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పాలనాధికారి చిత్ర మిశ్ర(Collector Chitra Mishra)కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ లు మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిలిపి వేసిన రైల్వే పాసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, ఎండి షుకూర్, సంయుక్త కార్యదర్శి దాడి సంపత్ అనుబంధ కమిటీల రాష్ట్ర నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.