తాడువాయిలోప్రమాదకర మలుపులు.. నిర్లక్ష్యమేనా?
ప్రమాదకరమైన మలుపులు
అదమరిస్తే అంతే సంగతులు
తాడ్వాయి,సెప్టెంబర్,20(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి(Yellareddy) రోడ్డుపై ప్రమాదకరమైన మలుపులు నెలకొన్నాయి.రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపెట్టనంత రీతిలో ఈ మలుపులు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పట్టణం వరకు ఈ రోడ్డుపై ఉన్న చాలా మలుపులు అపాయకరంగా మారాయి.తాడ్వాయి మండలం కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.తాడువాయి శివారులోని ఊర కుంట దగ్గరలో ఉన్న మలుపు ప్రమాదకరంగా మారింది.
ఈ మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు నెలవుగా మారింది.తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమం ముందు మరో ప్రమాదకరమైన మలుపు నెలకొంది.ఈ మలుపు వద్ద గతంలో మండలానికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదం బారిన పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.లింగంపేట మండలం గాంధీనగర్ గ్రామం వద్ద, లింగంపేట నుంచి ఎల్లారెడ్డి వరకు అనేక మూల మలుపులు ఉన్నాయి.మెంగారం, లక్ష్మాపూర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భయంకరమైన మలుపులు ఉన్నాయి ఈ మూల మలుపుల వద్ద అనేక ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.అయినా అధికారులు స్పందించడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.