గుండె సమస్యలపై జాగ్రత్త
కామినేని హాస్పిటల్స్ వైద్యుల సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రపంచ హృదయ దినోత్సవం(ప్రపంచ హృదయ దినోత్సవం)(World Heart Day) సందర్భంగా యువతలో గుండె ఆరోగ్యంపై(Heart health) అప్రమత్తత అవసరమని ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్ కార్డియాలజిస్టులు సూచించారు. ఆరోగ్యంగా, దృఢంగా కనిపించే వారిలోనూ అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి ముప్పు కారకాలు ఉండొచ్చని తెలిపారు.
కామినేని హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. ఎం.ఆర్.ఎం. బాబు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. ఏ. రవికాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. జి. శివప్రసాద్ మాట్లాడుతూ.. తీవ్రమైన ఛాతినొప్పి మాత్రమే గుండె సమస్యకు లక్షణం కాదని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కారణం తెలియని అలసట, దవడ, మెడ, వీపు లేదా పై పొత్తికడుపులో అసౌకర్యం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. వ్యక్తిగత గుండె ముప్పు కారకాలను తెలుసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గత ఏడాదిలో కామినేని హాస్పిటల్స్‌లో 2,287 గుండె సంబంధిత ప్రక్రియలు నిర్వహించగా, వాటిలో 40 ఏళ్లలోపు వారికి 175 ప్రక్రియలు జరిగాయని తెలిపారు. గత నెలలోనే 40 ఏళ్లలోపు వారికి 18 ప్రక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. బీపీ, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, పొగాకుకు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచించారు. డా. శేషిధర్ మాడక, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డా. జీవన్ బాబు వేసపోగు పాల్గొన్నారు.