బండ్లగూడ వైన్స్ హత్య కేసులో కీలక మలుపు
ప్రధాన సూత్రధారి ఉమా మహేష్ సహా ముగ్గురి అరెస్ట్.. 11కు చేరిన నిందితుల సంఖ్య
నాగోల్, సెప్టెంబర్ 22 విజయ క్రాంతి: బండ్లగూడ సుప్రీం వైన్స్(Bandlaguda Supreme Wines)లొ రౌడీషీటర్ నయీమ్ హత్య కేసు(Rowdy-sheeter Nayeem murder case)లో నాగోల్ పోలీసులు(Nagole Police) కీలక పురోగతి సాధించారు. కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఉమా మహేష్(Uma Mahesh) అలియాస్ జేకే మహేష్ (34)తో పాటు మహమ్మద్ మున్నా అలియాస్ బోలె (47), దుగ్గిరాల కార్తీక్ (29)లను ఎల్బీనగర్లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11కు చేరింది.
ఖమ్మంలో కుట్ర
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నయీమ్, ఉమా మహేష్ బాల్య స్నేహితులు. గతంలో ఇద్దరిపై ఇల్లందు పోలీస్స్టేషన్లో రౌడీషీట్లు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల(Real estate affairs) నేపథ్యంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నయీమ్ను హతమా ర్చేందుకు ఈ నెల 13న ఖమ్మంలోని ఓ హోటల్లో ఉమా మహేష్ తన అనుచరులతో కలిసి పథకం రచించినట్లు గుర్తించారు.
ఫోన్ చేసి ఆచూకీ తెలుసుకుని..
పథకం ప్రకారం మరుసటి రోజు నిందితులు ఖమ్మం నుంచి కారులో హైదరా బాద్కు చేరుకున్నారు. మున్నా ద్వారా న యీమ్కు ఫోన్ చేసి అతడి ఆచూకీ తెలుసుకున్నారు. బండ్లగూడ సుప్రీం వైన్స్లో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకున్న అనంతరం అక్కడికి చేరుకున్నారు.
కారం చల్లి.. వేటకొడవళ్లతో దాడి
వైన్స్ వద్ద నయీమ్ కళ్లలో కారం చల్లి నిందితులు అతడిని వెంబడించారు. అనంతరం సిట్టింగ్ ఏరియాలో వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటన అనంతరం ప్రధాన నిందితుడు ఉమా మహేష్ సహా కొందరు పరారయ్యారు.
ప్రత్యేక బృందాలతో వేట
ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో, ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ ఐపీఎస్, ఏసీపీ రవీందర్రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగింది. తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో కేసు లో కీలక నిందితుడు పోలీసులకు చిక్కినట్లయింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.