ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాల ఆరోపణలు..
ప్రజావాణిలో మండల సర్పంచుల ఫిర్యాదు
కోనరావుపేట అక్టోబర్ 05 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopet mandal)లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మండల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్పంచుల అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు నచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు జాబితాలు రూపొందిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామసభ తీర్మానాలు, అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా లబ్ధిదారుల జాబితాలు తయారు చేయడం సరికాదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. తాతల నాటి ఇంటి స్థలాలు కలిగి ఉన్న పేదలు, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.గ్రామసభ ఆధారంగా ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి పరిశీలనకు అధికారులు వస్తే అంగీకరించబోమని స్పష్టం చేశారు.