కుమ్రం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కుమ్రం భీం(Komaram Bheem) 86వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 26న జోడేఘాట్‌లో(Jodeghat) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha), ఐటీడీఏ పీఓ మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం జోడేఘాట్‌లో(Jodeghat) వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.వర్ధంతికి పెద్ద సంఖ్యలో గిరిజనులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, రహదారులు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు, సహాయక సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. భీం జీవితం, పోరాట స్ఫూర్తి, ఆదివాసీల హక్కుల కోసం చేసిన ఉద్యమాన్ని ప్రతిబింబించేలా, గిరిజన సంప్రదాయాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. శాఖల వారీగా అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భీం మనవడు సోనేరావు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.