నేమ్ బోర్డుల్లేక అయోమయం

30-09-2026 | 05:25am

గ్రామాల పేర్లు లేక వాహనదారులకు గందరగోళం

వెంకటాపురం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం మండలంలో గ్రామాల గుర్తింపునకు సంబంధించిన సూచిక బోర్డులు(Signboards)  కనిపించకపోవడంతో వాహనదారులు(Motorists) అయోమయానికి గురవుతున్నారు. ప్రధాన రహదారుల(Main roads) వెంట ఏ గ్రామం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.. దారులను సూచించే సూచిక బోర్డులు లేకపోవడంతో కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.

వెంకటాపురం మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల వద్ద గ్రామాల పేర్లు(Village names), దూరాలను తెలిపే సూచిక బోర్డులు సక్రమంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల అవి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లే వారు స్థానికులను అడిగి మార్గం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మండల కేంద్రానికి కూడా గుర్తింపు కరవే..!

వెంకటాపురం మండల కేంద్రానికి చేరుకున్నామని తెలిపే స్పష్టమైన సూచిక బోర్డు ఉండాల్సిన అవసరం ఉందని వాహనదారులు అంటున్నారు. ముఖ్యంగా తొలిసారి ఈ మార్గంలో ప్రయాణించే వారికి మండల కేంద్రం ఎక్కడ ప్రారంభమవుతుందో గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రధాన రహదారిపై స్పష్టమైన బోర్డు లేకపోవడం వల్ల ప్రయాణికులు తప్పుదారి పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాత్రి వేళ మరింత ఇబ్బందులు

పగటి సమయంలో స్థానికులను అడిగి గ్రామాల వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నా.. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చే అంబులెన్సులు(Ambulances), ఇతర వాహనాలు కూడా సరైన గ్రామానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారులు, గ్రామాల కూడళ్ల వద్ద గ్రామాల పేర్లు, మండల కేంద్రం పేరు, దూరాలను తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

ఇప్పటికే ఉన్న బోర్డులు దెబ్బతిని కనిపించకుండా పోయిన వాటి స్థానంలో కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల, ప్రయాణికుల భద్రత దృష్ట్యా సూచిక బోర్డుల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై ఆయా గ్రామాలకు వెళ్లే మార్గాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏ ఊరు ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని ముందుగానే గుర్తించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు