గేదెను చంపి తిన్న చిరుతలు.!
- గత కొన్ని నెలలుగా పూలుల సంచారం..పట్టించుకోకుండా పంచనామకే పరిమితమైన అటవీ శాఖ అధికారులు..!
- భయాందోళనలో గ్రామాలు తాండాలవాసులు.!
మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) :మండల పరిధిలోని మన్సూర్‌పల్లి, రెడ్డిపల్లి,కొండాపూర్,అశిరెడ్డిపల్లి గ్రామాల సమీపంలోని బొందేగట్టు వెనుక ప్రాంతంతో పాటు హన్వాడ మండలం ఎల్లంబాయి తాండ సమీపంలో చిరుతపులుల(Leopards) సంచారం కలకలం రేపుతోంది. ఎల్లంబాయి తాండకు చెందిన రైతు నున్సావత్ హన్మంతుకు చెందిన గేదెను గత రాత్రి చిరుత చంపి తిన్నట్లు రైతు, గ్రామస్థులు తెలిపారు.
గత కొన్ని నెలలుగా తాండ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని తాండాలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గేదెను చిరుతలు చంపడంతో గ్రామస్థుల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి.
రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని, ముఖ్యంగా పశువులను మేపేందుకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.చిరుతపులుల సంచారాన్ని గుర్తించి,వెంటనే చర్యలు చేపట్టి వాటిని పట్టుకోవాలని గ్రామాలు తాండాల ప్రజలు భయందొలనతో అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.