‘మామునూరు’కు బాపూజీ పేరు!

25-09-2026 | 05:00am

తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యజించిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji). 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైన వేళ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ఆకాంక్ష వైపు నిలిచిన ఆయన త్యాగం రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం. పదవిని కాపాడుకోవడం సులువు.. పదవినే వదిలి ప్రజల కోసం నిలవడం అసలైన నాయకత్వం.

అందుకే వరంగల్ మామునూరులో రూపుదిద్దుకోనున్న విమానాశ్రయానికి బాపూజీ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను కోరడం ప్రజాస్వామిక అవకాశం. ప్రభుత్వం రూ.295 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. మామునూరు విమానాశ్రయం ప్రయాణికుల రాక పోకలకే కాకుండా అభివృద్ధికి కొత్త ద్వారం కానుంది. పరిశ్రమలు, ప ర్యాటకం, విద్య, ఉపాధి, పెట్టుబడులకు మెరుగైన రవాణా అనుసంధా నంగా దోహదపడనుందని ప్రభు త్వం భావిస్తోంది.

అలాంటి మౌలిక వసతికి పెట్టే పేరు కూడా తెలంగాణ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేలా ఉండాలి.రుద్రమ, కాకతీయ, సమ్మక్క-సారలమ్మ పేర్లు తెలంగాణ చరిత్రకు గర్వకారణమే. కానీ,బాపూజీ పేరు ఆధునిక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తుంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం నుంచి నిజాం వ్యతిరేక పోరా టం, 1952 నాన్‌ముల్కీ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆయన ప్రజాజీవితంలో పోరాటమే ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్నప్పుడే దానిని వదిలిన త్యాగమే ఆయన పే రుకు ప్రత్యేక ముద్ర.

పద్మశాలి కుటుంబంలో జన్మించిన బాపూజీ ఒక వర్గానికే పరిమితమైన నా యకుడు కాదు. బీసీ వర్గాల సామాజిక గౌరవం, హక్కుల కోసం కూడా ఆయనకృషి చేశారు. అందువల్ల ఆయన పేరును వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పెట్టడం ఒక వ్యక్తిని స్మరించుకోవడమే కాదు.. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం తెలంగాణ చరిత్రను నిర్మిం చిందనే సందేశాన్ని కొత్త తరానికి అందించడం కూడా అవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుంచిన ఈ పేరు సూచనను కేవలం నామకరణ ప్రక్రియగా చూడవద్దు. ప్రజల ఆకాంక్ష, చరిత్ర, సామాజిక ప్రాతినిధ్యం, ప్రాంతీయ అభివృద్ధి---ఈ నాలుగింటినీ కలిపే నిర్ణయంగా మలచవచ్చు.

                శ్రీశైలం దూడం, ఫ్రీలాన్స్ జర్నలిస్టు, 9133947176

మరిన్ని వార్తలు