కులాంతర వివాహంపై చిచ్చు.. యువకుడి ఇల్లు ధ్వంసం
యువతి కుటుంబ సభ్యులే దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు
గ్రామంలో ఉద్రిక్తత.. పోలీస్ పికెటింగ్
గద్వాల, (విజయక్రాంతి): కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని(Jogulamba Gadwal District) ఓ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో చదువుకుంటున్న సమయంలో మేజర్లైన యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అనంతరం ఇరువురి అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే కులాంతర వివాహంపై యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తగా, యువకుడి కుటుంబానికి చెందిన ఇంటిని యువతి కుటుంబ సభ్యులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యువకుడు రంగముని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, యువతి విగ్నేశ్వరి బీసీ సామాజిక వర్గానికి చెందినట్లు తెలిసింది. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామంలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.