ఆకాశం నుంచి ఏరియల్ సర్వే

25-09-2026 | 05:15pm

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో పరిస్థితులను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన రూట్లలో భక్తుల రద్దీ, విగ్రహాల తరలింపు, ట్రాఫిక్ పరిస్థితులను ఏరియల్ వ్యూ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరిశీలించారు. బేగంపేట విమానాశ్రయం(Begumpet Airport)నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan), హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాల సరళిని వీక్షించారు.

నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేందుకు పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రధాన నిమజ్జన మార్గాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన రోజున నగరవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, అత్యవసర సేవలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర పాతబస్తీ మీదుగా చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల గుండా సాగి హుస్సేన్‌సాగర్ వైపు వెళ్లనుంది. ఈ రూట్‌లో భారీగా విగ్రహాలు తరలివస్తుండటంతో పోలీస్, జీహెచ్‌ఎంసీ అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా భూమిపై మాత్రమే కాకుండా ఆకాశమార్గంలోనూ నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షిస్తూ అధికారులు భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేశారు.

మరిన్ని వార్తలు