మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శక సేవలు
మహిళల పేరిటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క
భూపాలపల్లి,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడంతో పాటు మహిళలను ఆర్థికంగా స్వావలంబులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మండలం(Bhupalapally Mandal) పెద్దాపూర్ రైతువేదికలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(distribution of smart ration cards) కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు(ration card) బియ్యం పొందేందుకే కాకుండా ఆరోగ్యశ్రీ, ఆదాయ ధ్రువీకరణ తదితర అవసరాలకు కీలకమైన అధికారిక పత్రమని పేర్కొన్నారు.
మహిళలకు గౌరవం, స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 10 నుంచి 15 రోజుల్లో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి, వ్యాపారాల కోసం వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, గ్రామపంచాయతీమహిళా సంఘాల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో ఉన్న పేదలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా, సురక్షితంగా నిత్యావసర సరుకులు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో 1,39,530 స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3,95,962 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్, బావుసింగ్‌పల్లి, మూలపల్లి, లంబాడితండ, సుబ్బక్కపల్లి గ్రామాల్లో 1,993 కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నకిలీ, నకిలీ ప్రతుల కార్డులకు అవకాశం లేకుండా కార్డుల్లో తొమ్మిది రకాల భద్రతా అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులను టి-రేషన్ మొబైల్ యాప్‌తో అనుసంధానించామని, దీని ద్వారా కార్డు వివరాలను డిజిటల్‌గా వినియోగించుకోవచ్చన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పూర్తి కోటా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఎంపీడీవో తరుణ్ ప్రసాద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.