టిఫిన్‌ పెట్టారు.. యూనిఫాంలపై ఎమ్మెల్యే ఆగ్రహం!

05-10-2026 | 02:22pm

చిన్నచింతకుంట, అక్టోబర్ 5: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) స్పష్టం చేశారు. చిన్నచింతకుంట ZPHS పాఠశాలలో ప్రారంభమైన అల్పాహార పథకంలో పాల్గొని, విద్యార్థులతో కలిసి ఆయన టిఫిన్ చేశారు.

2,747 మందికి పౌష్టికాహారం. గ్రామీణ పేద విద్యార్థులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని 26 పాఠశాలల్లో (21 ప్రైమరీ, 5 హైస్కూల్స్) మొత్తం 2,747 మంది విద్యార్థులకు వారానికి 6 రోజుల పాటు పోషక విలువలతో కూడిన విభిన్న రకాల టిఫిన్లు, పాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

పలువురు విద్యార్థులకు ఇంకా ప్రభుత్వ యూనిఫాంలు అందకపోవడంపై అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. విద్యార్థులందరూ వెంటనే యూనిఫాంలో పాఠశాలకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లన్న, ఎంఈఓలు అనురాధ, మురళీకృష్ణ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు