ఆవులతో వెళ్తున్న కంటైనర్ పట్టివేత
గోవులను గోశాలకు తరలించిన మంథని పోలీసులు
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్(Manthani Police Station) పరిధిలో 31 ఆవుల(Cows)తో వెళ్తున్న కంటైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాటారం, బోర్లగూడెం, రెడ్డిపల్లి ప్రాంతాల నుంచి ఆవులను సేకరించి హైదరాబాద్ వైపు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మంథని ఎస్‌ఐలు సందీప్‌కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్వేష్, అనిల్, శ్రీకాంత్, శంకర్ కంటైనర్‌ను తనిఖీ చేసి అందులో ఉన్న 31 ఆవులను గుర్తించారు. అనంతరం వాటిని మంథని మండలంలోని బట్టుపల్లి కపిల గోశాలకు తరలించారు.
ప్రయాణంలో ఇబ్బందులకు గురైన కొన్ని ఆవులకు గోశాల నిర్వాహకులు ప్రత్యేకంగా సంరక్షణ అందిస్తున్నారు. బట్టుపల్లి గ్రామ సర్పంచ్ భూగోండ రవి, గోశాల నిర్వాహకులు గొట్టం రాజు, సమ్మన్న తిరుపతి ఆధ్వర్యంలో ఆవులకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించడంలో చొరవ చూపిన మంథని పోలీసులను పలువురు అభినందించారు. గోవుల రక్షణకు చర్యలు తీసుకున్న పోలీసు సిబ్బందికి గోభక్తులు కృతజ్ఞతలు తెలిపారు.