హరిణి హత్య కేసు నిందితులను శిక్షించాలి

23-09-2026 | 06:55pm

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

నిందుతులపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

లక్ష్మీదేవిపల్లి,(విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థిని(nursing student) హరిణి హత్య కేసులోని నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి ఖమ్మంలో నర్సింగ్ చదువుతూ, ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులోని బంధువుల ఇంటికి వచ్చిన మరుసటి రోజే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సమాచారం తెలిసిన వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని పరిశీలించి కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని ఇలా దారుణంగా హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. సమాజంలో మహిళలకు రక్షణ కరువవుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. హరిణి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఉప సర్పంచ్ పాషా తదితరులు వున్నారు.

మరిన్ని వార్తలు