గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేసిన ఎమ్మెల్యే
- 58 వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కీలక అడుగు
- ఆలేరు నియోజకవర్గంను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
- ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆలేరు, సెప్టెంబర్ 6 : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Aaleru MLA Beerla Ailaiah) ఆదివారం భూమి పూజ చేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభానికి మార్గం సుగమమైంది.
గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని సుమారు 58 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల ప్రాజెక్టును నిర్మించనుంది.
రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభించనుంది. ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిర్మలాపురం వద్ద ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.






