రైతులకు అందుబాటులో ఎరువులు
-హాకా సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడడంతో పాటు, వారు ఇబ్బందులు పడకుండా గ్రామస్థాయిలోనే యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. రాయవరం గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన హాకా సెంటర్‌ను మాజీ రైతుబంధు సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ దేవి రవీందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా రాయవరంలోనే హాకా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ రైతుల ఇబ్బందులను సర్పంచ్ బూడిద రమేష్ గౌడ్ తన దృష్టికి తీసుకురావడంతో హాకా సెంటర్ మంజూరుకు సహకరించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు.