‘అంతా రాములోరు చూస్కుంటారు’
సంగీత్ శోభన్(Sangeeth Shobhan), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీతో డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో ఈ మూవీ టైటిల్ గ్లింప్స్(Title Glimpse) లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను పోషించిన మారుతి క్యారెక్టర్ వందశాతం దేవుడికే వదిలేస్తాడు. అంతా రాములోరు చూస్కుంటారు అని నమ్మి బతికేస్తుంటాడు. ఈ మారుతి మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అతని మీద మీకు జాలి కలుగుతుంది, చిరాకేస్తుంది” అన్నారు.
హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ.. “ఈ సినిమాను గోదావరి జిల్లాల నేపథ్యంతో చేశాం. అక్కడి వాతావరణం మినీ కేరళలా అనిపించింది. షూటింగ్ ఇంకా పూర్తిచేయాల్సి ఉంది. ఈ చిత్రంలోని శిరీష, మారుతి పాత్రలను ప్రేక్షకులు ప్రేమిస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపింది. డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. “అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ వెనక కాన్సెప్ట్ ఉంది” అని చెప్పారు.
నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ.. “నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వు లేక నేను లేను’ లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో మంచి లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఏడాది క్రితం ఈ కథ విన్నప్పుడు నా ఫేవరేట్ మూవీలా లైబ్రరీలో ఉండిపోతుందనిపించింది. మనమంతా ఈ సినిమాతో ప్రేమలో పడతాం” అన్నారు. నిర్మాత గిరిబాబు మాట్లాడుతూ.. “వినోదాత్మకమైన ప్రేమకథతో మా సినిమాను నిర్మిస్తున్నాం. మా టైటిల్‌లో ఉన్నట్లు అంతా రాములోరు చూసుకుంటారు” అని తెలిపారు.






