కంపు కొడుతున్న ముప్పనపల్లి!
సైడ్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త
కన్నాయిగూడెం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామం(Muppanapalli Village)లో సైడ్ డ్రైనేజీ(Side drainage)ల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధ భరింతంగా మారాయి. చెత్త సమస్యను పరిష్కరించాలని పలు మార్లు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary)కి విన్నవించినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదని ముప్పనపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం లేదని, మురుగునీరు ఎక్కడికక్కడే తిష్ట వేసిందని, కనీసం బ్లీచింగ్ పౌడర్(Bleaching powder) కూడా చల్లడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. మురుగు, చెత్త పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే డ్రైనేజీలను పూర్తిగా పూడిపోయే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యను పలుమార్లు తెలియజేసినా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసినా పట్టించుకోకపోవడం వల్ల దోమలు, ఈగల బెడద తీవ్రంగా మారిందని చెబుతున్నారు. దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌తోపాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించి డ్రైనేజీల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
గ్రామంలో సైడ్ కాల్వలు క్లీన్ చేయక మురుగు వాసన వస్తోంది. డ్రైనేజీల్లో మురుగు నీరు నిండిపోయి దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నాం. తక్షణమే మండలం అధికారులు, స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్పందించి సైడ్ కాల్వలు శుభ్రం చేయించాలి. మురుగునీరు నిలవకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా శాశ్వత ప్రాతిపదికన పనులు రేపటి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలి.
నరెడ్ల అశోక్,
గ్రామస్తుడు, ముప్పనపల్లి