దాదా ఆగయా!
టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ(Tollywood star Nandamuri Balakrishna) హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకు ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఆదివారం ప్రకటించారు.
ఈ సినిమాకు ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపిస్తూ, గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఇక టైటిల్ గ్లింప్స్ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్, ఆరాను ప్రజెంట్ చేస్తూ, ఆయనను షేర్‌గా సంబోధించే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్‌కు బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి’ అని బాలా చెప్పిన డైలాగ్ అదిపోయింది.
ఈ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్ ఎస్ కశ్యప్, సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.






