భంగపడ్డ పాకిస్థాన్

27-09-2026 | 05:05am

ఐక్యరాజ్య సమితి వేదికగా (United Nations Platform)పాకిస్థాన్ అసత్యాలు ప్రచారం చేయాలనుకోవడం కొత్తేమీ కాదు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావే శాల్లో శుక్రవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగం ఇందుకు భిన్నమేమీ కాదు. గత ఏడాది ‘ఆపరేషన్ సిందూర్’ను మొదలుపెట్టి పహల్గామ్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో భారత్ ముందుకు కదలగా, ఆ యుద్ధంలో తామే విజయం సాధించినట్టు షరీఫ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా కనిపించింది.

షరీఫ్ ఆ మాటలు అంటు న్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయిన భారత్ దౌత్యవేత్త ఆర్ శ్రీనివాసన్ ఇబ్బందిని ప్రపంచమంతా చూసింది. పాకిస్థాన్ మిలిటరీ అధికారుల విజ్ఞప్తి మేరకే ఆనాడు ఆ యుద్ధాన్ని ఆపినట్టు భారత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ వల్లే రెండు దేశాల మధ్య యుద్ధం సమసినట్టు పాక్ ప్రధాని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇక కాశ్మీర్ అంశం ఇంకా అపరిష్కృతంగా ఉందన్నట్లు ఆయన పాక్ వైఖరిని మరోసారి బయటపెట్టారు.

సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు కేటాయించిన సింధూ జలాలను అడ్డుకుంటే తాము దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరిక జారీ చేశారు. సింధూ జలాల అంశంలో భారత్, పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని మాటలు మాట్లాడిన షరీఫ్‌కు ఈ సందర్భంగా, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పటినుంచి ఆపుతారు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారని విలేఖరులు ప్రశ్నించినప్పుడు, షరీఫ్ ఆ ప్రశ్నలను దాటవేస్తున్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనే జరిగిన మరో సందర్భాన్ని ప్రస్తావించుకోవాలి. భారత్ విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు.. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యలను భారత్ ఎప్పుడు ఆపివేస్తుందని ప్రశ్నించారు. అప్పుడు జయ్‌శంకర్ ఎంతమాత్రం తడుముకో కుండా ‘బాగుంది, ఒక ఉగ్రవాద దేశమా.. నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నది’ అని చెంప చెళ్లుమనిపించేలా సమాధానం చెప్పారు. ఉగ్రవాదులను ప్రో త్సహించడం, ఆశ్రయం కల్పించడం పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య అనేది ఐక్యరాజ్య సమితి వేదికపై నుంచి భారత్ మరోమారు ప్రపంచానికి స్పష్టం చేసినట్టయింది. 


మరిన్ని వార్తలు