ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: ఆర్డీవో
మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
వనపర్తి ( విజయక్రాంతి ) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం(RDO Subrahmanyam) సూచించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ భద్రత, నాణ్యమైన వైర్ల వినియోగం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
డీజేలను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజున వైన్ షాపులు మూసివేస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.