విరాళాల పార్టీలు

08-09-2026 | 05:30am

దేశంలో గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీల ఆర్థిక కార్యకలాపాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో నామమాత్రమైనా పోటీ చేయని, ఊరు పేరు లేని పలు పార్టీలు వందల కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్(Gujarat) కేంద్రంగా నమోదైన ఆరు అనామక పార్టీలు బీజేపీ మినహా దేశంలోని అన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువగా నిధులు సమీకరించం సహజంగానే అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాకుండా ఈ పార్టీలు ఒకటి రెండు చోట్ల మాత్రమే ఎన్నికల బరిలోకి దిగడం ఆలోచించాల్సిన విషయం.

2023 ఆర్థిక సంవత్సరంలో రూ.620 కోట్ల నిధులను సేకరించిన ఆమ్ జన్మత్ పార్టీ తరఫున గత లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక అభ్యర్థి పోటీచేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కాగితాలపై మాత్రమే కనిపించే ఇలాంటి రాజకీయ పార్టీలు భారీగా విరాళాలు సేకరిస్తూ, ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించకుండానే, ప్రజా సంక్షేమం పేరిట ఆ నిధులను ఖర్చు చేస్తున్నామని చెప్తుండటం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకారం దేశంలోని 739 గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో 82 శాతం పార్టీలు తమ లావాదేవీలను బహిర్గతం చేయకపోవడం శోచనీయం.

ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల విరాళాలపై అనుమానాలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో కీలకమైనది. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణకు సాధనంగా ఉండాలి తప్ప, నిధుల సేకరణకు ముసుగు కాకూడదు. ఊరుపేరు లేని పార్టీలకు విరాళాలు ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? భారీగా విరాళాలు సేకరించినా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? ఆ నిధులన్ని ఎటు పోతున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలను వెలికితీయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉన్నదని చెప్పక తప్పదు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సడలకుండా ఉండాలంటే రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరి. ధనబలం, అధికార బలం ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలు సేకరించే నిధుల లెక్క పక్కాగా ఉండాలి. కాగితాలపై రాజకీయ పార్టీలను సృష్టించి, కోట్లాది రూపాయల నిధులు సమీకరించి, తర్వాత కనుమరుగయ్యే పార్టీలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలి. లేకపోతే ఎన్నికల పవిత్రతపై ప్రజల్లో అనుమానాలు పెరగడమే కాదు, ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసమూ సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు.

మరిన్ని వార్తలు