పటేల్‌గూడ వార్డు కార్యాలయాన్ని సందర్శించిన జోనల్ కమిషనర్

08-09-2026 | 11:36am

అమీన్‌పూర్, సెప్టెంబర్ 08(విజయక్రాంతి): బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్‌గూడ వార్డు కార్యాలయాన్ని శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ (ఐఏఎస్) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ జోనల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీలలో రోడ్ల విస్తరణ, మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, తాగునీటి సరఫరాతో పాటు పలు మౌలిక సదుపాయాల సమస్యలను నరసింహ గౌడ్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ... డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఉన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ... కాలనీలలో నెలకొన్న ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకువెళ్లగానే జోనల్ కమిషనర్ అత్యంత సానుకూలంగా స్పందించారని, త్వరితగతిన పనులను పూర్తి చేయిస్తామని భరోసా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డివిజన్ సమగ్ర అభివృద్ధికి అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు