అధికారమే లక్ష్యంగా రాజకీయం
డా.తిరునహరి శేషు :
ప్రజల కేంద్రంగా పార్టీలు రాజకీయం(Politics) చేయాలి, ప్రభుత్వాలు పాలన(Government Administration) చేయాలి, నాయకులు(Leaders) సేవ చేయా లి. కానీ తెలంగాణ రాష్ట్ర శీతాకాల శాసనసభ సమావేశాల(Telangana State Legislative Assembly Winter Session) తొలి రోజు అసెంబ్లీ గే టు వద్ద జరిగిన పరిణామాలు, ఆ ఘటనలను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు(Political parties) చేసిన రాజకీయం, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు చూస్తే ఇందుకేనా రాష్ట్ర సాధ న కోసం 58 సంవత్సరాలు పోరాటం చే సింది, 369 మంది ఉద్యమకారులు పోలీ స్ కాల్పులలో మరణించింది, 1200 మంది ప్రాణాలను త్యాగం చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
గత కొంతకాలంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని రాజకీయ రణ క్షేత్రంగా మార్చివేశాయి. శాసనసభ సమావేశాలకి ముందే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నాయకుడు వివిధ సభలు, సమావేశాలలో పరుషమైన, పదునైన విమర్శలు- ప్రతివిమర్శల తో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. ఫలితంగా శాసనసభ సమావేశాల ప్రారం భం రోజునే రెండు పార్టీల మధ్య వివాదం మొదలైంది. చేజారిన అధికారం కోసం ఒకరు, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరొకరు చేస్తున్న రాజకీయ విన్యాసా లను ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారు.
వారి తప్పిదాలను వీరు తవ్వితీస్తున్నారు, వీరి వైఫల్యాలను వారు ఎత్తిచూపుతున్న క్రమంలో పైచేయి సాధించడానికి రెండు పార్టీలు చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో ప్ర శాంత వాతావరణాన్ని చెడగొడుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయాల కోసం మహిళలను, దళితులను అడ్డం పెట్టుకోవడం చూస్తుంటే, రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజ లలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితి రాబోయే శాసనసభ ఎన్నిక ల వరకు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వ్యవహారశైలిపై వివిధ వర్గాలలో చర్చ జరుగు తున్నది. ప్రధానంగా ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నాయకుడు వివిధ సభలు సమావేశాలలో మా ట్లాడుతున్న భాష, ఉపయోగిస్తున్న పరుష పదజాలంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై, వైఫల్యాలపై విధానపరమైన విమర్శలు చేయటాన్ని ఎవరు తప్పుబట్టరు. కానీ, ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై కాకుండా వ్యక్తిగత విమర్శలు రాజకీయాల లో దిగజారిపోతున్న విలువలకి తార్కాణంగా నిలుస్తున్నాయి.
కీలకమైన స్థానాల లో, బాధ్యతలలో ఉన్న ఇద్దరు నాయకులు మరొక రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వారే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ కీలకంగా మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఆ ఇద్దరు నాయకులు ఈ విధమైన పరుష పదజా లం ఉపయోగించి మాట్లాడుతుంటే వారి అనుచరుల నుంచి, ఆ సభలలో పాల్గొనే వారి నుంచి ముఖ్యంగా మహిళలు, యు వత నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం, హర్షాతిరేకాలు వ్యక్తం కావడం.
అందుకే వారు తమ ప్రసంగాలలో మరింత అభ్యంతరకరమైన పరుష పదజాలాలను ఉప యోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు అలా మాట్లాడటానికి స్పందించే వా రు కూడా ఒక కారణమే. వారి అభ్యంతరకరమైన ప్రసంగాలకి స్పందిస్తున్న వారిని కూడా ఒక్క ప్రశ్న అడగాలి- మీ పిల్లలను ఉద్దేశించి ఎవరైనా అదే భాషను ప్రయోగిస్తే అంగీకరిస్తారా!
చట్టసభలలో ప్రజా సమస్యలపై, ప్రభు త్వ విధానాలపై అర్థవంతమైన చర్చ లు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. 19 రోజులు జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కీలకమైన ప్రశ్నాపత్రాల లీకేజీపై, అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ అంశంపై, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగకుండానే పార్లమెంటు సమావేశాలు ముగి యటంతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.
అలాగే తెలంగాణ రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలలో 22ఏ నిషేధిత జాబితాలోని భూములు, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన జీవో నెంబర్ 97, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన జీవో నెంబర్ 9, ఫీజు బకాయిలు, ఎల్ నినో ప్రభావం వలన ఎండి పోతున్న పంటలు, పరిశ్రమలకి భూ కేటాయింపులు, నదీ జలాల వాటాల పంపిణీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పా లన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకి ఇచ్చిన హామీల అమలు గురించి శాసనసభలో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశించారు.
కానీ, శాసనసభ సమావేశాల మొదటి రోజు జరిగిన పరిణామాలతో ప్రజాసమస్యలు పక్కకి వెళ్లి రాజకీయ విమర్శలు, ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో విలువైన సభా సమయం, ప్రజాధ నం కూడా వృథా అయిందనే భావన ప్రజ ల్లో వ్యక్తమవుతున్నది. దళితులు, మహిళలు లాంటి సున్నితమైన అంశాలను అ డ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు రాజకీ యం చేయాలని చూడటం సరికాదు. దీనివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలకి వా రే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ప్రజల కేంద్రంగా సభలో చర్చ జరగాలి. విలువలతో కూడిన చట్టబద్ధమైన రాజకీయాలు చేయటానికి పాలక, ప్రతిపక్ష సభ్యులు ప్ర యత్నించాలి. పార్టీ ఫిరాయింపుదారుల తో, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్న వారితో నిండిపోయిన శాసనసభ నుంచి ఏ విలువలను, ఏ అర్థవంతమైన చర్చలు ఆశిస్తామని ప్రజలు నిర్వేదంతో మాట్లాడటం ప్రజాస్వామిక వ్యవస్థకు మంచిది కా దని నాయకులు, రాజకీయ పార్టీలు, ప్ర భుత్వాలు గుర్తిస్తే వారి గౌరవం ప్రతిష్ట ఇనుమడిస్తుంది.
రాష్ట్రంలో రాజకీయంగా ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకురాక పోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలిపో యే ప్రమాదం ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని పారిశ్రామిక అవసరాలకు కావలసిన 30 వేల హెక్టార్ల ల్యాండ్ బ్యాం క్ అందుబాటులో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ చెబుతున్నది.
కానీ, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు మొదటి మూడు స్థానాలలో ఉంటే, తెలంగాణ మాత్రం 13వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. కాబట్టి రాష్ట్రంలో పార్టీ లు, పాలకులు, ప్రభుత్వాలు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెడితే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్ర భుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరి వెయ్యి రోజుల పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ విజయాలపైన, పాలనా వైఫల్యాలపైన, హామీలపైన శాసనసభలో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ, తొలి రోజు నుంచే జరిగిన రాజకీయ పరిణామాలలో ప్రధాన ప్రతిపక్షానికి చెం దిన 22 మంది శాసనసభ్యులను మొత్తం శాసనసభ సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు.
కాబట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీగా 6 గ్యారంటీలు, వివిధ వర్గాలకు ఎ న్నికల సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్లకు సంబంధించి ఈ వెయ్యి రోజుల పాలనలో అమలు చేసిన విధానంపై శ్వేత పత్రం వి డుదల చేసి, తద్వారా ప్రజలలో విశ్వసనీయతను పెంచుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉన్నది. అలాగే రాబోయే రోజులలో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను కూ డా సభా వేదికగా ప్రకటిస్తే బాగుంటుంది. ప్రతిపక్ష నాయకుడు సభకి రాకపోవటాన్ని ప్రజలు హర్షించటం లేదు.
కానీ, ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పట్ల ఉపయోగిస్తున్న భాష, విమర్శిస్తున్న తీరును కూడా సామాన్య ప్రజలు హర్షించటం లేదు. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా మాట్లాడటం కంటే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలు ప్రజల ముందు పెడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రజల మెప్పు పొందితే ఈ ప్రభుత్వ విశ్వసనీయత మరింత పెరుగుతుంది.
వ్యాసకర్త సెల్: 9885465877