హీరోయిన్లను బ్లేమ్‌చేస్తారేం?!
టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar). ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పట్ల ఉన్న కొన్ని మూస ధోరణులను తప్పుబట్టింది. హీరోయిన్ల ప్రాధాన్యత, వారిపై వచ్చే విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
“పెద్ద చిత్రాలలో హీరోయిన్లకు కథ పరంగా ఎలాంటి ప్రాధాన్యత లేని, చాలా చిన్న పాత్రలను ఇస్తుంటారు. పాటలకో, కొన్ని సీన్లకో పరిమితం చేస్తారు. ఆయా సినిమాలు సరిగ్గా ఆడకపోతే మాత్రం.. సదరు హీరోయిన్ నటించడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ, ఆమెను ఐరన్ లెగ్ అంటూ బ్లేమ్ చేయడం, నిందించడం దారుణం. గడిచిన ఐదేళ్లలో వచ్చిన పెద్ద తమిళ సినిమాల్లో కేవలం రెండే రెండు గుర్తుండిపోయే మహిళా పాత్రలున్నాయి. తమిళ చిత్రాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత తగ్గడం బాధాకరం.
అలా అని మంచి అవకాశాలు వస్తాయని ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఎదురుచూడలేం. అందుకే ఉన్న అవకాశాలనే సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల అవకాశాలు రావడం మరింత కష్టంగా మారింది. నా కోసం ఒక సినిమాను లైన్‌లో పెట్టే కాంటాక్ట్స్ గానీ, మనుషులు గానీ నాకు లేరు. ప్రస్తుతం నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోందంటే అది అంత తేలికైన విషయం కాదు.
దాదాపు 15 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా ఉంటూ, ఎన్నో వివాదాలను తట్టుకుని నిలబడటానికి ఆమె ఎంతో ధైర్యం చూపించింది. ఒకప్పుడు హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న కథలు బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు చేయడం తగ్గించారు” అని పేర్కొంది. ప్రియా భవానీ శంకర్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో ప్రియా మాట్లాడుతూ.. ‘పెద్ద సినిమాల్లో కేవలం అలంకారప్రాయమైన పాత్రలు చేయడం కంటే, చిన్న సినిమాల్లోనైనా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడమే నాకు సంతోషాన్నిస్తుంది. ఇకపై ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటాన’ని తెలిపింది.






