సన్మానాలు కాదు.. రైతుల కన్నీళ్లు తుడవాలి
బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి
దేవరుప్పుల,(విజయక్రాంతి): సాగునీరు వచ్చాయని కాంగ్రెస్(Congress) నాయకులు శాలువాలు కప్పించుకుని సన్మానాలు చేసుకోవడం కాదని, నిజంగా కాలువలకు నీళ్లు విడుదల చేసి రైతుల కన్నీళ్లు తుడవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి బీఆర్ఎస్(BRS) శ్రేణులు డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు దేవరుప్పుల మండలం పెద్దతండాలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, చుక్కనీరు లేక వెలవెలబోతున్న కాలువలను పరిశీలించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ప్రచార ఆర్భాటాలు పక్కనపెట్టి తక్షణమే కాలువలకు సాగునీరు అందించి పంటలను కాపాడాలన్నారు.రైతుల కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని,పంటలకు నీరు అందేవరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని వారు హెచ్చరించారు.






