బోధన్ డివిజన్లో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
పండుగల నేపథ్యంలో 24/7 వాహన తనిఖీలు.. డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య(Nizamabad CP P. Sai Chaitanya), ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ(crime control)పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్యతో పాటు సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని సూచించారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్(PD Act) నమోదు చేయాలని ఆదేశించారు. పేకాట, గుట్కా, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
బోధన్ డివిజన్లో నమోదైన హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా తదితర కేసులను సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై బయట ఉన్న నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని తెలిపారు. రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేసి 24 గంటలూ వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు తక్షణ సహాయం అందించాలని కమిషనర్ సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. డయల్–112 సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్‌లను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు పర్యవేక్షణ పెంచాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, హైవేలకు అనుసంధానమయ్యే లింక్ రోడ్ల వద్ద అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడంతో పాటు రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను సంబంధిత నేషనల్, స్టేట్ హైవే అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని, ఓవర్‌స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, రిసెప్షన్ నిర్వహణ, రికార్డులు, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల నియంత్రణకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.