ఒకే పార్టీ.. రెండు వర్గాలుగా ర్యాలీలు

25-09-2026 | 04:45pm
  1. సమన్వయ లోపమా? వర్గ పోరా?
  2. మండల రాజకీయ వర్గాల్లో చర్చ

గంభీరావుపేట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో(Congress Party) వర్గపోరు బహిరంగంగా బయటపడింది.ఒకే అంశాన్ని పురస్కరించుకుని ఒకే రోజు రెండు వర్గాలు వేర్వేరు ర్యాలీలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) సెప్టెంబర్ 30న సిరిసిల్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాజీ మండల అధ్యక్షుడు హమీద్ తన అనుచరులతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సిరిసిల్లకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో నూతన అధ్యక్షుడు తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో అభినందన ర్యాలీ నిర్వహించారు.కేజీ టు పీజీ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ సాగింది.

ఇక అదే అంశంపై మాజీ అధ్యక్షుడు హమీద్, పార్టీ నాయకులు పర్శ హన్మాండ్లు, కొమిరిశెట్టి తిరుపతి, ప్యాక్స్ చైర్మన్ వేశాల వెంకటి ఆధ్వర్యంలో మరో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఒకే రోజు, ఒకే అంశంపై రెండు వేర్వేరు ర్యాలీలు నిర్వహించడం సమన్వయం లోపించడం గమనార్హం. రాబోయే రోజుల్లో గంభీరావుపేట కాంగ్రెస్ లో వర్గాల మధ్య భేదాలు సర్దుబాటు అవుతాయా లేదా మరింత ముధురతాయాఅన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు