విద్యుత్ శాఖ తీరు పై సర్పంచుల ఆగ్రహం

24-09-2026 | 06:31pm

సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సర్పంచుల డిమాండ్.

తాంసి/భీంపూర్ సెప్టెంబర్ 24(విజయక్రాంతి): విద్యుత్ శాఖ(Electricity Department) అధికారుల తీరు పై భీంపూర్ మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. గురువారం భీంపూర్ మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి గోపి కిషన్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు..గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, వాటిని సరిచేయాలని పలుమార్లు కోరిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అర్లి (టీ)సర్పంచ్ కామన్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు ప్రమాదం జరిగే లోపు సమస్యను పరిష్కరించాలని కోరారు.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు...ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. సర్వసభ్య సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన సమస్యలపై సర్పంచులు అధికారులను నిలదీశారు. మండలంలో 7,658 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని డిప్యూటీ తహసీల్దార్ హరిదాస్ సమావేశంలో తెలిపారు. అలాగే మండల కేంద్రంలో సెప్టెంబర్ 30 న ఎక్స్‌రే క్యాంపు నిర్వహిస్తున్నట్లు స్థానిక వైద్యాధికారి వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు, నూనె తదితర పోషకాహార సామగ్రి నాణ్యతగా అందడం లేదని కరంజి (టీ)సర్పంచ్ కాల్చప్ యాదవ్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు..పంచాయతీరాజ్ శాఖ అధికారుల తీరుపైనా పిప్పల్ కోటి సర్పంచ్ దాసరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని,గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సర్పంచులు కోరారు...

మరిన్ని వార్తలు