గణేష్ మండపాల వద్ద భద్రతా నిబంధనలు తప్పనిసరి
బూర్గంపాడు,(విజయక్రాంతి): రానున్న గణేష్ నవరాత్రుల(Ganesh Navratri) నేపథ్యంలో మండపాల నిర్వాహకులు, మండల సర్పంచులతో బూర్గంపాడు పోలీసులు(Burgampadu Police) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మే ప్రసాద్ భద్రతా మార్గదర్శకాలను వెల్లడించారు.మండపాల వివరాలను పోలీస్ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేసి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. విద్యుత్ అనుమతి తీసుకోవడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
మండపాల వద్ద, ఊరేగింపుల్లో డీజేలు వినియోగించరాదని స్పష్టం చేశారు.ప్రతి మండపం వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు ఇసుక బకెట్లు, నీటి వసతి లేదా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు వినియోగించరాదని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే లేదా రెచ్చగొట్టే పాటలు, నినాదాలకు తావివ్వరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.