చేర్యాలలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

01-10-2026 | 08:21pm

చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల మండల కేంద్రంలోని రేణుక గార్డెన్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలకు చెందిన 56 మంది మైనారిటీ(Minority) లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, 252 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy), భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... నాలుగు మండలాల పరిధిలోని 53 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున ఎంపీ నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు.

తపస్ పల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను నాలుగు మండలాల్లోని చెరువులు, కుంటలు నిండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిఎంఎఫ్టీ, ఎంపీ నిధులు, కలెక్టర్ నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల సమస్యలను గుర్తించి సర్పంచులు ప్రణాళికలు తయారు చేసి అందజేయాలని సూచించారు.తపస్ పల్లి రిజర్వాయర్ నుంచి అన్ని గ్రామాల చెరువులు, కుంటలకు నీళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు